వెంపాడు టోల్ ప్లాజా వద్ద డ్రగ్స్ కలకలం..
రూ.1.32 కోట్ల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెంపాడు టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు భారీ గంజాయి రవాణాను భగ్నం చేశారు. ఈగల్ టీమ్ అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అనుమానాస్పద ఇన్నోవా, ఎర్టిగా కార్లను తనిఖీ చేయగా 264 కిలోల గంజాయి బయటపడింది.
ఈ మేరకు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ మురళితో కలిసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న సోమేష్, కవటి సాయి తేజ, సచిన్ గెహ్లాట్, రాజబాబు అనే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న 264 కిలోల గంజాయి విలువ సుమారు రూ.1.32 కోట్లు కాగా, రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లతో కలిపి మొత్తం స్వాధీనం విలువ రూ.1.69 కోట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
విచారణలో రోలుగుంటకు చెందిన మలసాల మోహన్ అలియాస్ వెంకట్ అలియాస్ పరమేశ్ ఈ గంజాయి రవాణా నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. అలాగే కేరళ, మంగళూరుకు చెందిన వ్యక్తులు ఈ గంజాయిని స్వీకరించాల్సి ఉన్నట్లు గుర్తించారు.
నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు సన్నిబాబు, అంజూతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
