Surveyors | ఐదువేల పోస్ట్ లు ….10 వేల ద‌ర‌ఖాస్తులు మంత్రి పొంగులేటి ..

హైద‌రాబాద్ :- రాష్ట్రంలో భూప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి ఖ‌చ్చిత‌మైన భూ రికార్డుల‌ను రూపొందించ‌డం ద్వారా భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపడానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయ‌కత్వంలో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ప‌ని చేస్తుంద‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

భూభార‌తి చ‌ట్టంలో రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియకు భూమి సర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చ‌డం త‌ప్ప‌నిస‌రి చేశామ‌ని ఈ విధానాన్ని వీలైనంత త్వ‌ర‌గా అమ‌లులోకి తీసుకురావ‌డానికి పెద్ద‌సంఖ్య‌లో స‌ర్వేయ‌ర్ల అవ‌స‌రాన్ని గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకోసం ఐదువేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కానికి ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా 10,031 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని తెలిపారు. లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కంపై సోమ‌వారం నాడు పొంగులేటి స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను వెంట‌నే పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈనెల 26వ తేదీ నుంచి గ‌చ్చిబౌలి లోని స‌ర్వే ట్రైనింగ్ అకాడ‌మీ ( TALIM) లో రెండు నెల‌ల పాటు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న గ్రామీణ ప్రాంతాల‌లో ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డంతో పాటు భూ వివాదాల‌ను ప‌రిష్క‌రించాల‌న్న ప్ర‌భుత్వ ఆశ‌యం నెర‌వేరుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

డిజిటలైజేష‌న్ ఆఫ్ విలేజ్ మ్యాప్స్‌

టి‌జి‌ఆర్‌ఏ‌సి (TGRAC – తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్ చేప‌డుత‌న్నామ‌ని మంత్రి తెలిపారు. ప్రయోగాత్మకంగా నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని లింగాల గ్రామం, జ‌గిత్యాల జిల్లా మాల్యాల మండ‌లంలోని త‌క్క‌ల‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా క‌ల్లూరు మండ‌లంలోని పెద్దకోరుకొండి మూడు గ్రామాలలో ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ప్రారంభించ‌బోతున్నామ‌ని తెలిపారు.
ఈ – డిజిటల్ మ్యాప్ లను ఎక్కడినుండైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చని, మాన్యువల్ పద్ధతుల కంటే వేగంగా , తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారం పొందవచ్చ‌న్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూక్షేత్రాల పరిమాణం, ఆకృతి వంటి వివరాలు ఖచ్చితంగా పొందవచ్చన్నారు .ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగ‌డంతో పాటు మ్యుటేష‌న్ ప్రక్రియ వేగవంతం అవుతుంద‌న్నారు. పునరుద్ధరణ , భద్రత డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ చేయవచ్చు కాలానుగుణంగా అప్డేట్ చేయవచ్చు అని వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *