ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి…
ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి…
- ఉమ్మడి జిల్లా ఆర్ సి ఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్
- సమాజంలో శాంతిని పరిరక్షించడం మనందరి బాధ్యత… తుంబూరి దయాకర్ రెడ్డి
- చైతన్యపరిచిన ఐక్య క్రైస్తవ సంఘాల రన్ ఫర్ జీసస్ ర్యాలీ
- హాజరైన ఫాదర్స్, పాస్టర్స్, క్రైస్తవ సంఘాల బాధ్యులు
ఖమ్మం కల్చరల్, ఆంధ్ర ప్రభ : ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్ సి ఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ తెలియజేశారు. ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్లో రన్ ఫర్ జీసస్ ర్యాలీ ప్రారంభోత్సవంలో బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ తూర్పు దేశాలలో యుద్ధాల వలన ప్రపంచమంతటా శాంతికి విఘాతం కలుగుతుందని, ప్రపంచంలోని ప్రజలందరూ నిత్యవసర సరుకులు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ యుద్ధ వాతావరణం వెంటనే సమసిపోవాలని ఆకాంక్షించారు.
లోక రక్షకుడైన ఏసుప్రభువు బోధనలలో మనకు నేర్పిన శాంతి, సమాధానం, కరుణ, పరోపకారం గుణాలను పెంపొందించుకోవాలని, ఇతరుల పట్ల ఆప్యాయతలు, క్షమాగుణం ఉండాలని తెలిపారు. సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించేలా తమ తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఇంచార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో శాంతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
క్రైస్తవుల లోని అన్ని సంఘాలు ఐక్యంగా రన్ ఫర్ జీసస్ ను నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు. ఐక్య క్రైస్తవుల సంఘం కన్వీనర్ పాస్టర్ రమేష్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ఖమ్మం నగరంతో పాటు పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన మత గురువులు పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం క్రైస్తవ సంఘాల ఐక్యతను ప్రతిబింబిస్తున్నదని తెలియజేశారు.
దాదాపు వెయ్యి మంది క్రైస్తవులతో స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ మయూరి సెంటర్, పాత బస్టాండ్ రోడ్, వైరా రోడ్, జడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఐక్య క్రైస్తవ సంఘాల కన్వీనర్ పాస్టర్ రమేష్, ఐక్య క్రైస్తవ సంఘాల ప్రతినిధులు వికారి జనరల్ ఫాదర్ టి శౌరి, ఫాదర్ సురేపల్లి ఐజక్, ఫాదర్ విజయ్ కుమార్, పాస్టర్ పల్లా రవి కిషోర్, పాస్టర్ జాకబ్ ,సంఘ పెద్దలు ముత్తమాల ప్రసాద్, కొమ్ము ప్రసాద్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
