అలా చేస్తే.. దొంగతనాలను నిరోధించవచ్చు.

అలా చేస్తే.. దొంగతనాలను నిరోధించవచ్చు.
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: వేసవి సెలవుల సందర్భంగా ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో ఇంటి భద్రత పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే ముందు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.
ఇంటి భద్రత కోసం బయటకు వెళ్లే ముందు తలుపులు బాగా లాక్ చేయడం, పక్కింటివారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. అలాగే విలువైన నగదు, బంగారం వంటి వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలను నిరోధించవచ్చని చెప్పారు. ఇంటి బయట సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవడం కూడా అవసరమని పేర్కొన్నారు.
పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
ఇక వేసవి కాలంలో చెరువులు, కుంటలు, కాలువల వద్ద చిన్నారులు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా నియంత్రించడం చాలా ముఖ్యమన్నారు.
అత్యవసర సమయంలోనే బయటకు వెళ్ళాలి..
ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తగినంత నీరు వెంట తీసుకెళ్లాలని సూచించారు. హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సీఐ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సూచించారు.
