సూపర్ ఎల్‌నినో పరిస్థితులను తెలివిగా అధిగమించాలి..

తాగునీటికే తొలి ప్రాధాన్యత

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి
ప్రతి పంటకు పీఎం ఫసల్ బీమా యోజనలో తప్పనిసరిగా నమోదు కావాలి
జిల్లా కలెక్టర్, సాగునీటి సలహా మండలి చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, జులై 30( ఆంధ్రప్రభ): జిల్లా కలెక్టర్, సాగునీటి సలహా మండలి చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌ నందు 5వ సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఖరీఫ్–2026 సీజన్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణా తూర్పు డెల్టా ఆయకట్టుకు నీటి లభ్యత, పంపిణీ, సాగు ప్రణాళికలపై జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా సమీక్షించారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల రాష్ట్రంలో నీటి వనరులపై తీవ్ర ప్రభావం ఏర్పడిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు అయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను పూర్తిగా నివారించలేకపోయినా, బీమా ద్వారా రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ పథకంపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయని తెలిపారు. అలాగే ఎగువ ప్రాంతాల్లోని ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయిలో నిండలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో జలాశయాలకు వచ్చే నీటిని తొలి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో సుమారు 29 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ, వినియోగించదగిన నీరు సుమారు 25 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వచ్చే ఏడాది జూన్–2027 వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నీటిని జాగ్రత్తగా నిల్వ ఉంచాల్సి ఉంటుందని వివరించారు.

కృష్ణా డెల్టాకు ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేస్తున్నరని తెలిపారు. అయితే గోదావరి నదిలోనూ నీటి ప్రవాహం తగ్గిపోవడంతో పట్టిసీమలోని 24 పంపులను పూర్తిస్థాయిలో వినియోగించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం 20 పంపులతో మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించారు. గతంలో గోదావరి నుంచి పట్టిసీమకు 100 నుంచి 120 రోజులపాటు నీటి లభ్యత ఉండేదని, ప్రస్తుతం అది 60 నుంచి 70 రోజులకు మాత్రమే పరిమితమైందన్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ముందుగా గోదావరి డెల్టా ఆయకట్టుకు నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సుమారు 60 లక్షలకు పైగా ప్రజల తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిజర్వాయర్లలో తగినంత నీరు లేకుండానే వరి సాగు ప్రారంభిస్తే, తర్వాత వర్షాలు లేకపోయినా లేదా జలాశయాలకు నీరు రాకపోయినా రైతుల మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ప్రస్తుతం వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన “వేసిన ప్రతి పంటకూ.. బీమా చేయాల్సిందే” అనే అవగాహన గోడపత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రైతులు పంట బీమాపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.గుణకరరావు, కేఈ డివిజన్ ఈఈ బి.ఆంజనేయ ప్రసాద్, కేసీ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, స్పెషల్ డివిజన్ ఈఈ కె.బాబు, ఏఈఈలు జి.రాజు, కె.శ్రీనివాసరావు, ఏఈ బి.హరీష్ నాయుడు, సాగునీటి వినియోగదారుల సంఘాల సభ్యులు ఎం.ఎస్. ప్రసాద్, ఏ.ఆర్.బి. వెంకటేశ్వరరావు, కె.సునీత, కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.