భక్తులకు గౌరవమే తొలి సేవ
- భద్రత మర్యాదపూర్వక సేవలే ముఖ్యం
- సెల్‌ఫోన్ల ప్రవేశాన్ని పూర్తిగా అడ్డుకోవాలి
- భక్తులతో మర్యాదగా వ్యవహరించాలి
- జై భవాని” అంటూ ఆహ్వానించాలి
- దుర్గగుడి ఈవో శీనా నాయక్
- ఆకస్మిక తనిఖీల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: భక్తులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తూ మర్యాదపూర్వక సేవలను అందించాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ పేర్కొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భద్రతా నిబంధనల అమలుపై కార్యనిర్వహణాధికారి కలెక్టర్ శినా నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భద్రతా సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ల నిషేధాన్ని భద్రతా సిబ్బంది వందశాతం అమలు చేయడం లేదని గుర్తించిన ఈఓ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలయ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించరాదని, ఈ విషయంలో భద్రతా సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. భక్తుల సహకారంతో నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసి ఆలయ పవిత్రతను పరిరక్షించాలని సూచించారు. అలాగే, దర్శనానికి వచ్చే భక్తులతో భద్రతా సిబ్బంది మర్యాదగా, వినయపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. భక్తులను పలకరించే సమయంలో భక్తి భావాన్ని ప్రతిబింబించేలా “జై భవాని” అని సంబోధించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో పాటు ఆత్మీయతను కలగలిపిన సేవలు అందించాలని ఈఓ సీనా నాయక్ భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
