చెన్నూరులో చేపల వర్షం?..
పట్టణంలో ఆసక్తికర చర్చ
వర్షంతో పాటు చేపలు పడ్డాయంటూ ప్రచారం..
నిజానిజాలపై చర్చ
చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో గురువారం చేపలతో కూడిన వర్షం కురిసిందంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ ఘటన పట్టణ ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.
స్థానికుల కథనం ప్రకారం, గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య గురువారం ఉదయం పుప్పాల హనుమాన్ వీధిలో వర్షంతో పాటు చిన్న చేపలు రోడ్డుపై, ఇళ్ల ముందు పడినట్లు కాలనీవాసులు గమనించారు. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
వర్షంలో పడిన చేపలను పిల్లలు, స్థానికులు గొడుగులు, బకెట్లు పట్టుకుని సేకరించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం, చిత్రాలు కొందరు స్థానికులు సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోవడంతో విషయం వైరల్‌గా మారింది.
అయితే, ఆకాశం నుంచి చేపలు పడ్డాయా? లేక వరద ప్రవాహంలో కొట్టుకువచ్చిన చేపలు వర్షపు నీటితో కలిసి రోడ్డుపైకి చేరాయా? అనే అంశంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
