‘ఏక్ పెడ్ మా కే నామ్’తో మొక్కలు నాటిన ఎన్‌సీసీ క్యాడెట్లు
మైలవరం, ఆంధ్రప్రభ : డా. లకిరెడ్డి హనుమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరంలోని ఎన్‌సీసీ యూనిట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్ – ప్రతి క్యాడెట్‌కు ఒక మొక్క’ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సపావత్ మాధవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని జీవితంలో ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్‌సీసీ అధికారి డా. జె. రాముడు మాట్లాడుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లు ‘ఐక్యత – క్రమశిక్షణ‘ అనే ఎన్‌సీసీ మూల సూత్రాలను పాటిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటున్నారని తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణలో తమ బాధ్యతను నిర్వర్తించడం ప్రతి క్యాడెట్ కర్తవ్యమని అన్నారు.
కార్యక్రమంలో ఎన్‌సీసీ స్టాఫ్ ప్రదీప్ శర్మ, ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి, అధ్యాపకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
