పింగళి వెంకయ్య ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య ఆశయాలను నేటి తరానికి చేరవేసి, వాటి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆదివారం మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ వెంకట బాపిరాజు మాట్లాడుతూ.. భారత జాతీయ పతాకాన్ని దేశానికి అందించిన మహనీయుడు పింగళి వెంకయ్య తెలుగువారు కావడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమన్నారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఎన్‌సీసీ, గుర్రపు స్వారీ, సైనిక శిక్షణ వంటి అంశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పింగళి వెంకయ్య సేవలను భావితరాలకు చాటిచెప్పేలా మచిలీపట్నంలో ఆయనకు తగిన స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయాలనే వినతిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, మచిలీపట్నంలో పింగళి వెంకయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని కోరారు. సీఐ ఏసుబాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, స్టార్ కాలేజీ డైరెక్టర్ శ్రీరామ్, పంతం గజేంద్ర తదితరులు మాట్లాడుతూ, పింగళి వెంకయ్య జీవితాంతం దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఉత్తమ అధికారిగా ప్రభుత్వ ప్రశంసలు అందుకుని విజయవాడకు బదిలీపై వెళ్తున్న పెద్దిరాజును వెలుగు ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మాజీ సైనికులు, వెలుగు ఫౌండేషన్ సభ్యులు, మైత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు కే. వేణు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం వెంకట గజేంద్రరావు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.