దుర్గ‌గుడి సిబ్బందికి ప్రత్యేక త‌ర‌గ‌తులు…

  • సేవ‌లు, ఫైళ్ల నిర్వ‌హ‌ణ‌పై శిక్ష‌ణ‌
  • జ‌న‌వ‌రి 5 నుంచి శిక్ష‌ణ‌కు ఏర్పాట్లు..
  • ట్ర‌స్టుబోర్డు సూచ‌న‌ల‌మేర‌కు వ‌ర్క్‌షాప్‌..

ఆంధ్ర‌ప్ర‌భ‌, ఎన్టీఆర్ బ్యూరో : దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి వార్ల దేవ‌స్థానానికి భ‌క్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం వేలాది మంది చ‌ల్ల‌నిత‌ల్లి క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుంటున్నారు. అయితే భ‌క్తుల‌కు అందించే సేవ‌ల్లో చాలా లోటుపాట్లు జ‌రుగుతుండ‌డంతో భ‌క్తులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

అదేవిధంగా ఏళ్ల త‌ర‌బ‌డి దేవ‌స్థానంలో ఉండి ప‌దోన్న‌తిలో ఉన్న‌త‌స్థానానికి చేరుకున్న ఉద్యోగులు నేటి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా అప్‌గ్రేడ్ కాక‌పోవ‌డంతో… ప‌రిపాల‌న ఇబ్బందిగా మారింది. చాలామంది కంప్యూట‌ర్ వాడ‌కం, స్పీడ్‌గా రాత ప్ర‌తులు రూపొందించ‌డం, ఈ-ఆఫీస్ వంటి అంశాల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న లేక‌పోవ‌డాన్ని ట్ర‌స్టుబోర్డు గుర్తించింది.

ఈ నేప‌థ్యంలో భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందించ‌డంతోపాటు ఫైళ్ల నిర్వ‌హ‌ణ సంబంధించి వారికి శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు దేవ‌దాయ‌శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆధ్వ‌ర్యంలో విభాగాల వారీగా త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు దేవ‌స్థానం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఫైళ్ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. మెరుగైన సేవ‌లు భ‌క్తుల‌కు అందించేలా సిబ్బందికి త‌ర్ఫీదు ఇవ్వ‌నుంది.

జనవరి 5 నుంచి త‌ర‌గ‌తులు…

దేవస్థానం లోని కొన్ని విభాగాలలో సిబ్బంది ఫైళ్ల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించకపోవడం, ఉద్యోగులు భక్తులకు తగిన స్థాయిలో సేవలు అందించడంలో విఫలమవుతున్నారన్న విష‌యాన్ని ఉన్న‌తాధికారులు తెలుసుకున్నారు. ఇదే అంశంపై డిసెంబ‌రు 5న జ‌రిగిన ట్ర‌స్టుబోర్డు స‌మావేశంలో చైర్మ‌న్‌, స‌భ్యులు కూడా ప్ర‌స్తావించి వారికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పించాల‌ని ఈవోకు సూచించారు.

అదేవిధంగా సెక్యూరిటీ, శానిటేష‌న్ సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌పై భ‌క్తుల నుంచి అనేక ఫిర్యాదు వ‌స్తున్న విష‌యాన్ని కూడా స‌మావేశంలో స‌భ్యులు అధికారుల దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో దేవ‌స్థానం ప‌రిపాల‌న మ‌రింత మెరుగుప‌డే ఉద్దేశంతో పాటు భ‌క్తుల‌కు స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు అందించే ల‌క్ష్యంతో జ‌న‌వ‌రి 5 నుంచి స‌మీక్ష‌, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల షెడ్యూల్‌ను దేవ‌స్థానం ప్ర‌క‌టించింది.

ఎవ‌రెవ‌రికి అంటే…

దేవ‌స్థానంలో ప‌నిచేసే రికార్డు అసిస్టెంట్లు, జూనియ‌ర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్లు, అటెండ‌ర్లు, స్వీప‌ర్లు, సెక్యూరిటీ సూప‌ర్‌వైజ‌ర్లు, సెక్యూరిటీ గార్డులు, హోం గార్డులు, శానిటేష‌న్ సూప‌ర్‌వైజ‌ర్లు, కార్మికుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. మ‌హా మండ‌పంలో 4వ అంత‌స్తులో జ‌న‌వ‌రి 5 సోమ‌వారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు ప్రోటోకాల్, డోనర్ సెల్, సేవాదారుల రిజిస్ట్రేషన్, ఫీడ్‌బ్యాక్ కౌంటర్లు, ఐటి విభాగం, ప్రసాదం, టికెట్ కౌంటర్ల 2వ షిఫ్ట్ సిబ్బందికి సమీక్ష, శిక్షణా తరగతులు జ‌రుగుతాయి.

మొద‌టి షిఫ్టు సిబ్బందికి మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 వ‌ర‌కు శిక్ష‌ణ ఉంటుంది. ఆరో తేదీ ఉద‌యం బ్యాచ్‌లో 2వ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డులు, హోం గార్డులు, సెక్యూరిటీ సూపర్వైజర్లతో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం నుంచి మొద‌టి షిఫ్టు వారు స‌మీక్ష‌కు హాజ‌ర‌వుతారు.

అలాగే ఏడో తేదీ మ‌ధ్యాహ్నం 2 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు వివిధ విభాగాలకు సంబంధించిన అంశాలపై శిక్షణా తరగతులుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ధార్మిక , దాన సంస్థల చట్టం కింద రూపొందించిన నియమావళిపై అవగాహన క‌ల్పిస్తారు.

8వ తేదీ ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 2వ షిఫ్ట్ శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లతో శానిటేషన్ అంశాలపై శిక్ష‌ణ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 వ‌ర‌కు మొద‌టి షిఫ్టు వారు హాజ‌ర‌వుతారు. ఇప్ప‌టికే ఈ త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన ఆదేశాల‌ను సంబంధిత డిపార్ట్‌మెంట్ల‌వారీగా పంపారు.

ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను కూడా ఈవో ఆదేశించారు. అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, ఏఈవోలు, సూప‌రింటెండెంట్లు, విష‌య నిపుణ‌లు ప‌లు అంశాల‌పై ఉద్యోగుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. సంబంధిత విభాగాల ఏఈవోలు, సూప‌రింటెండెంట్లు త‌మ ఆధ్వ‌ర్యంలో ఉన్న సిబ్బంది అంతా శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యే విధంగా చూడాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఈ శిక్ష‌ణ ద్వారా ఎండోమెంట్స్ చట్టం, నియమావళిపై అవగాహన క‌ల‌గ‌డ‌మే కాక ఫైళ్ల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌కు ఆస్కార‌మేర్ప‌డుతుంది. భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందించే అవ‌కాశం ఉంది.