బీచ్‌కి వెళ్లిన ఇద్దరు గల్లంతు..

ముమ్మరంగా గాలింపు చర్యలు

ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం), ఆంధ్రప్రభ: స్నేహితుల దినోత్సవం రోజు విశాఖ సాగరతీరంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలసి పాతగంగవరం బీచ్‌కు ఫోటోషూట్‌కు వెళ్లిన ఏడుగురు స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు.దీనికి సంబంధించి విశాఖ న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్‌ దామోదర్‌,జాలారిపేటకు చెందిన నీతూతో పాటు మరో ఐదుగురు ఆదివారం బీచ్‌కు వెళ్లారు.బీచ్‌లో ఫొటోలు దిగుతున్న సమయంలో జాలారిపేటకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని నీతూ (18) రాకాసి అలల్లో కొట్టు-కుపోగా, ఆమెను కాపాడేందుకు సముద్రంలోకి దూకిన పెందుర్తికి చెందిన దామోదర్‌ కూడా బలమైన అలల ధాటికి గల్లంతయ్యాడు.

సమాచారం అందుకున్న న్యూపోర్ట్‌ పోలీసులు, లైఫ్‌గార్డులు, గజఈతగాళ్లు, స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సముద్రం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దామోదర్‌కు కొద్ది రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో ఇరు కుటు-ంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.