పశ్చిమ సమగ్రాభివృద్ధికి భారీ కార్యాచరణ..

పశ్చిమ సమగ్రాభివృద్ధికి భారీ కార్యాచరణ..

ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’.. రూ.25 లక్షల ఆరోగ్య భరోసా: చంద్రబాబు

భీమవరం, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భూ హక్కుల పరిరక్షణ నుంచి పేదల ఆరోగ్య భద్రత వరకు పలు కీలక ప్రకటనలు చేశారు.

భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం, రైతుల ఆస్తి హక్కులను శాశ్వతంగా పరిరక్షించడం, భూ వివాదాలకు ముగింపు పలకడం లక్ష్యంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.

పచ్చదనంతో అలరారే ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలని కొనియాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల భూ రికార్డులు తారుమారై అనేక వివాదాలు తలెత్తాయని ఆరోపించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం

రైతుల భూ యాజమాన్య హక్కులను హరించే విధంగా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకొచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు.

భూమి రికార్డులను ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయని, రైతుల భూములపై అనవసర వివాదాలు సృష్టించారని ఆరోపించారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా చిత్రాలు ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు.

ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’

పేదల ఆరోగ్య భద్రత కోసం ‘సంజీవని’ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులకు భరోసా కల్పిస్తామని చెప్పారు.

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు

భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సాంకేతికతతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

కరెన్సీ నోట్ల తరహాలో భద్రతా లక్షణాలు, రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూమి రికార్డులను నవీకరించామని, 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశామని వివరించారు. మరో 62.32 లక్షల పుస్తకాలను కూడా నిర్దేశిత గడువులోగా పంపిణీ చేస్తామని తెలిపారు.

భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన తదితర 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు.

1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించామని, 15 జిల్లాల్లో 33,012 ఎకరాల షరతుగల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేశామని పేర్కొన్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం

‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మూడు విడతల్లో 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,985 కోట్లు జమ చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ఏడాదికి రూ.20 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

గోదావరి డెల్టా ప్రాంతంలో కాలువలు, చెరువుల మరమ్మతులు సమర్థవంతంగా చేపడుతున్నామని, ప్రస్తుతం ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని వెల్లడించారు.

ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యం

గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆక్వా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని చెప్పారు.

దాణా ధరలు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.

సంక్షేమం – అభివృద్ధే లక్ష్యం

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో నూరుశాతం సీసీ రహదారుల నిర్మాణం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Leave a Reply