నూతన లడ్డూ పోటు పనులకు వేగం
నూతన లడ్డూ పోటు పనులకు వేగం
జులై లోనే లడ్డూ తయారీ ప్రారంభానికి లక్ష్యం
పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు
భక్తులకు కొరతలేని ప్రసాదాల పంపిణి
దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఈఓ శీనా నాయక్
నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్, ఈవో
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా లడ్డూ ప్రసాదాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మిస్తున్న నూతన లడ్డూ పోటు భవన నిర్మాణ పనులను బుధవారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలు, పూర్తి చేయాల్సిన మిగిలిన పనులపై ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, కాంట్రాక్టర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో మరింత వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాబోయే జులై మొదటి వారంలోనే నూతన భవనంలో లడ్డూ తయారీ ప్రక్రియ ప్రారంభం కావాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా జూన్ నెలాఖరు నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి అవసరమైన సదుపాయాలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పరిశుభ్రమైన వాతావరణంలో నూతన లడ్డూ పోటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నూతన లడ్డూ పోటు అందుబాటులోకి వస్తే ప్రసాదాల తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి. భక్తులకు వేగవంతమైన సేవలు అందించడంలో ఇది కీలకంగా మారనుందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, లడ్డూ పోటు విభాగం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
