కూలే ప్రమాదం ముంచుకొస్తుంటే…

కూలే ప్రమాదం ముంచుకొస్తుంటే…

కొత్త భవనం ఎప్పుడో?

గంపలగూడెం, ఆంధ్రప్రభ: మండలంలోని పెనుగొలను గ్రామంలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పశుపోషకులు, సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. భవనం పైకప్పు పెంకులు ఊడి కిందపడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది.

వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. భవనంలోకి వర్షపు నీరు రాకుండా తాత్కాలికంగా టార్పాలిన్ కప్పి నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ సిబ్బంది, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చల్లగుండ్లవారిపాలెం, జింకలపాలెం, రాజవరం గ్రామాలకు చెందిన పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 1983లో ఈ పశువైద్యశాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ కేంద్రం ఊటుకూరు పశువైద్య అధికారి పరిధిలో ఇన్‌చార్జ్ విధానంలో కొనసాగుతోంది.

ఈ పశువైద్య కేంద్రం పరిధిలో సుమారు 870 ఆవులు, 1,100 గేదెలు, 620 గొర్రెలు, 650 మేకలు ఉన్నాయి. ఒకప్పుడు వైద్యం కోసం వచ్చే పశువులతో ఈ కేంద్రం కళకళలాడేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు పశువులను కేంద్రానికి తీసుకురావడానికే ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో కాటన్, మందులు వంటి వైద్య సామగ్రిని నిల్వ చేయడమూ కష్టంగా మారిందని సిబ్బంది పేర్కొంటున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మాణం అత్యవసరంగా మారిందని రైతులు అంటున్నారు.

ఈ పశువైద్య కేంద్రం కోసం 2022లో పది సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, ఇప్పటి వరకు కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించేలోపు శిథిల భవనాన్ని తొలగించి, ఆధునిక సౌకర్యాలతో కొత్త పశువైద్యశాల నిర్మించాలని కూటమి ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

Leave a Reply