దోష రహిత ఓటర్ల జాబితా తయారీ లక్ష్యంగా సర్..
దోష రహిత ఓటర్ల జాబితా తయారీ లక్ష్యంగా సర్..
ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకం
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది
ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటం సర్ ప్రక్రియ ప్రాథమిక ఉద్దేశం
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పారదర్శకంగా అత్యంత ఖచ్చిత్వంతో ఓటర్ల జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) – 2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026) ప్రక్రియ పై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తో కలసి గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమని, దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికాయుత కృషి జరుగుతోందని సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియకు సన్నద్ధత, అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) జనరేషన్, ప్రింటింగ్, ఈఎఫ్‌ల అందజేత, బీఎల్‌వో కిట్లు, తదితరాల గురించి వివరించారు.
పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, ఓటర్ల మ్యాపింగ్ ప్రతి విషయం గురించి తెలియజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని.. ఆపై జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని.. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలసవెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందాన్నారు .
ఇందుకు సంబంధించి పారదర్శకతకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే సమయంలో బీఎల్‌వోలు తమ వద్ద తగినన్ని ఫారం-6, 7, 8 తదితరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ జరగాలన్నారు. ఈ సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఓటర్ల జాబితాలను లోపరహితంగా, పారదర్శకంగా తీర్చిదిద్దడమే సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రక్రియను పరిమితమైన కాలవ్యవధితో పూర్తిచేయాల్సి ఉన్నందున అధికారులు, సిబ్బంది పూర్తి సమర్థతతో, బాధ్యతాయుతంగా పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా, అత్యంత కచ్చితత్వంతో ఈ ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. తుది ప్రతిపాదనలను త్వరలోనే ఎన్నికల సంఘం ఆమోదానికి పంపడం జరుగుతుందన్నారు. సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందన్నారు.
ఈ బృహత్తర కార్యక్రమం కోసం నియమితులైన ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు ఇప్పటికే సమగ్రమైన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. బీఎల్‌వోలకు ఐడీ కార్డుల పంపిణీ పూర్తయిందన్నారు. సర్ ప్రక్రియపై ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారి సహకారాన్ని కోరడం జరిగిందన్నారు. పౌరులందరూ, రాజకీయ పార్టీలు ఈ సర్ – 2026 ప్రక్రియ జయప్రదం కావడానికి సహకరించాలని, ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ సంప్రదించాలని కోరామన్నారు.
ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ నుండి అధ్యక్షులు మొదలవలస రమేష్, పిఎంజె బాబు, బిజెపి నుండి బిఎల్ సింగ్, వైయస్ఆర్ సిపి నుండి డి. మన్మధరావు, ఐటి కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్. అన్నాజిరావు, కెవిఎల్ఎస్ ఈశ్వరి, బిఎస్పీ నుండి బి. కృష్ణారావు, సిపిఐ(ఎం) నుండి డి. గోవిందరావు, గోవిందరావు, జెఎస్పీ నుండి బి. అర్జున్ కుమార్, సిపిఐ నుండి చిక్కాల గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఈఆర్ఓలు పద్మావతి, జి. జయదేవి, లక్ష్మణమూర్తి, లావణ్య, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు, జడ్పీ సిఈఓ వెంకటరామన్, ఎలక్షన్ డిటీలు, తదితరులు పాల్గొన్నారు.
