కోటబొమ్మాళి, (ఆంధ్రప్రభ): – శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి (kotabommali) మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలోని 16వ నెంబర్ జాతీయ(NH16) రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా(Odisha) రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా నుంచి సింహాచలం దేవస్థానం దర్శనం నిమిత్తం బ్రహ్మపురం రాధాకృష్ణ వీధకి చెందిన గోకుల్ పండా (33), మిసినిపూర్ కు చెందిన సంతోషి శబత్ (34), సుశాంత్ కుమార్ శబత్ (44) వాహనంలో వెళ్తూ ఎత్తు రాళ్లపాడు (Rallapadu) సమీపంలో వాహనం ఆపి కాల కృత్యాలు తీర్చుకొని తిరిగి వాహనం ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని అంబులెన్స్ లో శ్రీకాకుళం రిమ్స్ (RIMS) కు తరలించగా అప్పటికే మృతి చెందారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటబొమ్మాలి ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు. వెనకనుంచి ఢీకొని ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.