వ్యక్తిని ఢీకొట్టిన వేగం…

  • రోడ్డుపై మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా
  • వరుస రోడ్డు ప్రమాదాలతో ఆందోళన..

మంత్రాలయం, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి–167పై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న చిలకలదొన్న, నిన్న కళ్లుదేవకుంట, నేడు చట్నీహళ్లి గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్నీహళ్లి గ్రామానికి చెందిన మృతుడి మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ హైవే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.

సమాచారం అందుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ మల్లికార్జున, తహసీల్దార్ (ఎంఆర్వో) రమాదేవి ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రాంతంలో వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగించారు.

ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారి–167పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం.