భూకబ్జా ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు

  • కోట్ల రూపాయిల భూమిని కాజేయాలన్న కుట్రను భగ్నం –చేసిన పోలీసులు
  • 13మంది నిందితులు.. 8 మంది అరెస్టు
  • మిగిలిన నిందితులను చట్ట ప్రకారం అరెస్టు చేస్తాం
  • జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ.3 నుంచి రూ.4 కోట్ల విలువైన ఖాళీ స్థలాన్ని నకిలీ పత్రాలు, తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన భూకబ్జా ముఠా గుట్టును శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఛేదించారు.

ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 13 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు.

అరెస్టయిన వారిలో అడబాల అలియాస్ అండవరపు రజని, తెలుగు సతీష్ కుమార్, సాలిపిల్లి లక్ష్మణరావు, ముదాడ్ల ఉపేంద్ర కుమార్, జెగురిపాటి ఉపేంద్రరావు, మామిడి గోపాలకృష్ణ, సాంబాన సాంబశివరావు, కూన పెద్దిరాజు ఉన్నారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

1988, 1992 సంవత్సరాల్లో చాపురం గ్రామ పంచాయతీ, బలగ పరిధిలోని సర్వే నంబర్ 35/13లో ఉన్న ప్లాట్లను ఫిర్యాదుదారుడి తండ్రి కట్ట కనక లింగేశ్వరరావు చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివసిస్తుండటంతో ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు ముందస్తు పథకం ప్రకారం కబ్జాకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కుట్రలో భాగంగా అసలు యజమాని జీవించి ఉన్నప్పటికీ మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, దాని ఆధారంగా నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు తయారు చేశారు. అనంతరం తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు రూపొందించి కోట్ల రూపాయల విలువైన భూమిపై యాజమాన్య హక్కు చెలాయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్థలానికి ప్రహరీ నిర్మించే ప్రయత్నాన్ని అసలు యజమాని కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తులో నకిలీ పత్రాల తయారీ, తప్పుడు వారసత్వ ధ్రువీకరణ, అక్రమ రిజిస్ట్రేషన్ వంటి అంశాలు బయటపడ్డాయని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, భూములు కొనుగోలు చేసే ముందు భూ రికార్డులు, యాజమాన్య పత్రాలు, వారసత్వ ధ్రువీకరణలు, రిజిస్ట్రేషన్ వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. రూ.5 లక్షలకు మించిన భూ లావాదేవీలను పాన్ కార్డు వివరాలతోనే నిర్వహించాలని తెలిపారు. నకిలీ పత్రాల సృష్టి, ప్రభుత్వ రికార్డుల తారుమారు, భూ కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సి.హెచ్. వివేకానంద పర్యవేక్షణలో శ్రీకాకుళం రూరల్ సీఐ పైడపు నాయుడు, ఎస్‌ఐ సురేష్, ఆమదాలవలస ఎస్‌ఐ బాలరాజు, శ్రీకాకుళం వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణతో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.