భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు…
- ఇంద్రకీలాద్రిపై ఈఓ ఆకస్మిక తనిఖీలు
- ఘాట్ రోడ్డు, కేశఖండనశాల, కృష్ణా స్నానఘట్టాల పరిశీలన
- పారిశుధ్యం, భద్రత, క్యూ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
- భక్తులతో నేరుగా మాట్లాడి సేవలపై అభిప్రాయాల సేకరణ
- రద్దీ నియంత్రణకు సిబ్బందికి కఠిన ఆదేశాలు
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. సీనా నాయక్ ఆలయ ఘాట్ రోడ్డు, కేశఖండనశాల, కృష్ణా నది స్నానఘట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అందరికిలాద్రిపై విస్తృత తనిఖీలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈఓ వి.కె. సీనా నాయక్ విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. చేతిలో వైర్‌లెస్ సెట్‌తో ఘాట్ రోడ్డు వెంబడి స్వయంగా నడుస్తూ భక్తుల రద్దీ, సేవల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. కృష్ణా నది స్నానఘట్టాల వద్ద భక్తుల పవిత్ర స్నానాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం కేశఖండనశాలలో తలనీలాల సమర్పణ హాల్, స్నానపు గదులు, మరుగుదొడ్ల పారిశుధ్యాన్ని తనిఖీ చేసి, తలనీలాలు సమర్పించిన భక్తులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఘాట్ రోడ్డులోని టికెట్ కౌంటర్లు, మొబైల్ డిపాజిట్ కేంద్రాలు, చెప్పుల స్టాండ్లు, లగేజీ కౌంటర్లు, భద్రతా స్కానింగ్ కేంద్రాల పనితీరును కూడా ఈఓ సమీక్షించారు. భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించి క్యూ లైన్లు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోర్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆషాఢ ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈఓ శీనా నాయక్ సూచించారు.
