ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ను కలిసిన టీడీపీ ఇన్‌చార్జ్ విక్కుర్తి..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు ఆదివారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.
అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మరింత చేరువ కావడం, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
