నాగర్‌కర్నూల్‌లో రాజకీయ సందడి

ఎన్నికలే లక్ష్యంగా పార్టీల కసరత్తు
క్యాడర్ బలోపేతంపై దృష్టి
కాంగ్రెస్ అభివృద్ధి.. ప్రతిపక్షాల ఉద్యమం
ఎన్నికలే లక్ష్యం.. జిల్లాలో పార్టీల వ్యూహాలు షురూ
పార్టీ బలోపేతం, క్యాడర్ సమీకరణ, ఓటర్ల నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : మరో రెండున్నర నుంచి మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తుండగా, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని పోరాటాలను ఉధృతం చేస్తున్నాయి. అదే సమయంలో పార్టీ నిర్మాణం, క్యాడర్ బలోపేతం, ఓటర్ల నమోదు కార్యక్రమాలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.

ప్రస్తుతం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొల్లాపూర్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి డాక్టర్ రాజేష్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండగా, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి డాక్టర్ మల్లు రవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

30 నెలల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. కొత్త భవనాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమీకృత పాఠశాలలు, నాగర్‌కర్నూల్‌లో మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధుల కేటాయింపు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల వేగవంతం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పూర్తి ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఇక బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలను కొనసాగిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, రైతు సమస్యలు, మొక్కజొన్న కొనుగోలు, ప్రభుత్వ పనితీరులో లోపాలపై నిరసనలు, పాదయాత్రలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ క్యాడర్‌ను చైతన్యపరిచే పనిలో ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ కూడా జిల్లా స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇటీవల జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ.. శిక్షణా శిబిరాలు, సభ్యత్వ విస్తరణ, ఓటర్ల నమోదు కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. పలువురు ప్రముఖ నేతలు పార్టీలో చేరే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం రైతులు, కార్మికులు, యువజనులు, విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీతో పాటు ఇతర ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు, కార్మిక సంఘాలు కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

మొత్తంగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నాగర్‌కర్నూల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ నిర్మాణం, క్యాడర్ బలోపేతం వంటి అంశాలతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.