మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సొరంగ మార్గం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందిస్తామని వెల్లడి
కంచనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, రూ.3 కోట్లతో సబ్‌స్టేషన్ మంజూరు
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ) సొరంగ పనులను పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం ద్వారా జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందించి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానానికి నల్లగొండ ప్రజలే బలమని, వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కంచనపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని, రూ.3 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
దోమలపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాలు నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, వారంలో రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తానని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.
