గోదావరి నదిలో భద్రతా చర్యలు కట్టుదిట్టం..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: ఇటీవల గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన నేపథ్యంలో బాసరలో దేవస్థానం, పోలీసు అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గోదావరి నది పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే నదిలో ప్రమాదకర ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గోదావరి నదిలో లోతట్టు ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా ఇనుప జాలీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం ఆలయ సిబ్బంది మైక్‌ల ద్వారా నిరంతరం హెచ్చరికలు, అవగాహన సందేశాలు ప్రసారం చేస్తున్నారు.

భక్తులు నదిలో స్నానాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచిస్తున్నారు. గోదావరి నది తీర ప్రాంతాల్లో ఆలయ హోమ్ గార్డులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ భద్రతా ఏర్పాట్లను సీఐ దీపక్ పర్యవేక్షించగా, ఆలయ సిబ్బంది రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు కూడా అధికారుల సూచనలను పాటించి సహకరించాలని అధికారులు కోరారు.

Leave a Reply