Searches | పినరయి విజయన్ నివాసం వద్ద ఈడీ సోదాలతో…
Searches | పినరయి విజయన్ నివాసం వద్ద ఈడీ సోదాలతో…
Searches | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేరళ రాజకీయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
విజయన్ కుమార్తె టీ.వీణాకు చెందిన ‘ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్’ సంస్థకు, సీఎంఆర్‌ఎల్ కంపెనీకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలు రావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్‌ఎల్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం మరుసటి రోజే ఈడీ అధికారులు దాడులు చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మాజీ సీఎం నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయని తెలుసుకున్న సీపీఎం కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, అక్కడ విధుల్లో ఉన్న ఈడీ అధికారులపై కొందరు కార్యకర్తలు దాడికి దిగినట్లు సమాచారం. ఘటనలో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలు ఈడీ అధికారుల వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో కేరళ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
