High Court | అమరావతి కేసు కొట్టివేత..
High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరిపై గతంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.
అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదైంది.
2021 ఫిబ్రవరి 24న అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు విచారణ చేపట్టి చంద్రబాబును మొదటి నిందితుడిగా, నారాయణను రెండో నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు తాజా నిర్ణయంతో అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణకు న్యాయపరంగా భారీ ఊరట లభించినట్లయింది.
