దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి..

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి..

  • జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి

చిలుపూరు, ఆంధ్రప్రభ : దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించేలా రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ కాస్ట్స్) ఆర్డర్–1950లోని పేరా–3ను తొలగించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో జస్టిస్ బాలకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ షెడ్యూల్డ్ కులాల మూలాలు కలిగిన దళిత క్రైస్తవులు ఇప్పటికీ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మత మార్పిడి జరిగినంత మాత్రాన కుల ఆధారిత వివక్ష, సామాజిక వెనుకబాటుతనం అంతరించిపోవడం లేదని, కేవలం మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఎస్సీ హోదాను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 46లో పొందుపరిచిన సమానత్వం, సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమ లక్ష్యాలకు అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. గతంలో సిక్కు, బౌద్ధ మతాలను స్వీకరించిన దళితులకు షెడ్యూల్డ్ కులాల గుర్తింపును విస్తరించిన నేపథ్యంలో, అదే సూత్రాన్ని దళిత క్రైస్తవుల విషయంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్‌తో పాటు పలు కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేయాలని సూచించారు. రాజ్యాంగంలోని పేరా–3ను తొలగించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు మూడు లక్షల మంది షెడ్యూల్డ్ కులాల మూలాలు కలిగిన క్రైస్తవులు ఉన్నారని, వారికి ఎస్సీ హోదా కల్పించడం ద్వారా విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, రాజ్యాంగబద్ధమైన రక్షణలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

సమానత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే దిశగా ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌ను ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.