ప్రజలకు అందుబాటు ధరలో సన్నబియ్యం..
- రైతు బజార్లో సన్నబియ్యం విక్రయాలకు శ్రీకారం
కదిరి టౌన్, ఆంధ్రప్రభ : కదిరి పట్టణంలోని మాసానంపేట ఉట్టి సమీపంలోని రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటు ధరలో అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమం, అభివృద్ధి అనే ద్వి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కళావతి, ఎమ్మార్వో రెడ్డి శేఖర్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు నాయకులు, కూటమి నాయకులు, సిబ్బంది, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
