తగ్గింపు ధరలకే బియ్యం…

విక్రయాలను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలి


మండవల్లి, ఆగస్టు 3 (ఆంధ్రప్రభ) : మండవల్లి మండలంలోని భైరవపట్నంలోని సత్తిరాజు రైస్ మిల్లులో రైస్ మిల్కర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో సోమవారం తక్కువ ధరలకే బియ్యం విక్రయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వైస్ చైర్మెన్ గాదిరాజు భాస్కర వర్మ మాట్లాడుతూ… బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన దృష్ట్యా తక్కువ ధరలకే సన్న రకం బియ్యం ను ప్రత్యేక కౌంటర్ల ద్వారా రేషన్ కార్డుదారులకు విక్రయాల ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

ఈ విక్రయ కేంద్రాలలో స్టీమ్ బియ్యం కేజీ రూ.52లకు, రా బియ్యం రూ.50లకు విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. రేషన్ కార్డుకు 10 కేజీలు చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎన్డీయే నాయకులు కొండ, బాబి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రైతు బజార్ల ద్వారా, రాష్ట్ర వ్యాప్తంగా తగ్గింపు ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.రాష్ట్రంలో 115 రైతు బజార్లలోనూ, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక పాయింట్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అందిస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బహిరంగ మార్కెట్లో ధరల భారం నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.