పరిటాల రవీంద్ర సాగునీటి పథకం కాలువ పనుల పరిశీలన
పరిటాల రవీంద్ర సాగునీటి పథకం కాలువ పనుల పరిశీలన
భూములిచ్చిన రైతులతో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ సమావేశం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: రైతులకు మెరుగైన సాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన పరిటాల రవీంద్ర సాగునీటి పథకం పనులను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్తో కలిసి కాలువ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పేరూరు ప్రాజెక్టు) వరకు చేపడుతున్న 54 కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా వేపకుంట గ్రామ సమీపంలోని 32.2వ కిలోమీటర్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.
అలాగే బానుకోట గ్రామ సమీపంలోని 30.6వ కిలోమీటర్ వద్ద నిర్మాణంలో ఉన్న అక్విడెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పనుల నాణ్యత, పురోగతి, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
రైతుల సహకారంతోనే సాగునీటి ప్రాజెక్టులు విజయవంతమవుతాయని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే పరిసర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
