స్వామి వివేకానంద స్టడీ సర్కిల్ ప్రారంభం
గ్రామీణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ.. డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి
గట్టి పునాది, నిరంతర సాధనతోనే విజయాలు: కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: నేటి యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనా విధానం, నైపుణ్యాలను పెంపొందించుకుని స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. యువతలో వ్యక్తిత్వ వికాసం, లక్ష్యసాధన, పోటీ పరీక్షలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద స్టడీ సర్కిల్ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
శనివారం కదిరిలోని ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి స్వామి వివేకానంద స్టడీ సర్కిల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద యుక్తవయసులోనే ప్రపంచాన్ని అధ్యయనం చేసి భారత యువతకు దిశానిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత కూడా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్స్, సివిల్స్, పోలీస్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణతో పాటు ఉత్తమ అధ్యయన వాతావరణాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారం అభినందనీయమన్నారు.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మాట్లాడుతూ యువతకు గట్టి పునాది, నిరంతర సాధన రెండూ సమానంగా అవసరమని చెప్పారు. వెదురు మొక్క ప్రారంభంలో బయటకు ఎదగకుండా భూమిలో బలమైన వేర్లు పెంచుకున్న తర్వాత వేగంగా ఎదిగినట్లే, జీవితంలో కూడా బలమైన పునాది ఉంటేనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని వివరించారు. అలాగే గొడ్డలికి పదును పెడితేనే అది సమర్థవంతంగా పనిచేసినట్లే, విద్యార్థులు కూడా నిరంతరం తమ జ్ఞానం, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలని సూచించారు. ఒకసారి చదవడం సరిపోదని, కాలానుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే జీవిత లక్ష్యంపై స్పష్టత ఏర్పడితే అదే భవిష్యత్తులో గొప్ప సంపదగా మారుతుందని అన్నారు. గతంలో గ్రామీణ యువతకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాలు ఉండేవి కాదని, ఇప్పుడు జిల్లాలోనే అలాంటి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో మండల స్థాయిలో కూడా ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరింత మంది గ్రామీణ యువతకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
స్టడీ సర్కిల్ నిర్వాహకులు రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్, డీఎస్సీ, పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ, అధ్యయన సామగ్రి, మార్గదర్శకత్వం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, బీసీ సంక్షేమ శాఖ అధికారి బాలాజీ, ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
