పుట్టపర్తిలో పెను ప్రమాదం తప్పింది..
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కారులో మంటలు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పుట్టపర్తిలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పట్టణంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కర్ణాటకలోని ధార్వాడ ప్రాంతం నుంచి రాత్రంతా ప్రయాణించి చికిత్స కోసం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చిన భక్తులకు చెందిన కారును ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచారు. అయితే సోమవారం ఉదయం ఒక్కసారిగా కారులో నుంచి దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న రోగులు, వారి బంధువులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి మంటలను ఆర్పివేయడంతో సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు మంటలు వ్యాపించకుండా నివారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో కారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ ప్రమాదం తప్పడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.
