రైతుల సమస్యలపై స్పందించిన కలెక్టర్

రైతుల సమస్యలపై స్పందించిన కలెక్టర్
పీకలవాగును తనిఖీ చేసి అధికారులకు సూచనలు
గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు మండలం బుడంపాడు వద్ద పీకలవాగును జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మంగళ వారం తనిఖీ చేశారు. పీకలవాగు పరిస్థితిని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. వాస్తవ ప్రవాహ మార్గాన్ని ప్రక్కకు మరల్చటం వలన గుంటూరు పట్టణం దిశ నుండి ప్రవాహం అధికం అయినప్పుడు పంట పొలాల్లోకి మురుగు నీరు ప్రవహించడమే కాకుండా పంట పొలాలు చౌడు భారుతున్నాయని, వాస్తవ ప్రవాహ మార్గానికి మళ్ళించి రైతులకు ఉపశమనం కలిగించాలని కోరారు.

మురుగు నీటి ప్రవాహంలో ఆసుపత్రి సిరంజీలు, సూదులు, ఇతర ఆసుపత్రి వ్యర్థాలు సైతం వస్తున్నాయని తెలిపారు. ఇది రైతుల దీర్ఘకాలిక న్యాయమైన కోరిక అని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే గ్రామ సభ ఏర్పాటు చేసి రైతుల సంతృప్తి మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రోన్ ద్వారా మొత్తం ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, ఎ.పి.ఐ.ఐ.సి జోనల్ మేనేజర్ నరసింహ రావు, నగర పాలక సంస్థ ముఖ్య ప్రణాళిక అధికారి రాంబాబు, తహసీల్దార్ సుభాని, తదితరులు పాల్గొన్నారు.
