నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నరసరావుపేట, ఆంధ్రప్రభ ; పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ తెలిపారు.

అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని వెల్లడించారు.

అర్జీదారులకు సూచనలు

సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో అర్జీ సమర్పించాలని, గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రసీదు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.

డిజిటల్ పర్యవేక్షణ

అర్జీల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం డిజిటల్ విధానంలో పర్యవేక్షిస్తోందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుల ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ అలర్ట్ పంపిస్తారని చెప్పారు. నోటీసులు, ఎండార్స్‌మెంట్లు వాట్సాప్ ద్వారా పంపడంతో పాటు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారని వివరించారు.

మండలాలు, మున్సిపాలిటీల్లోనూ స్వీకరణ

జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు తమ సమీప కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు.

1100 కాల్ సెంటర్, ఆన్‌లైన్ సేవలు

కలెక్టరేట్‌కు రాకుండానే సమస్యలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘మీ కోసం’ 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీల స్థితిగతులను కూడా ఈ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.

ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరై వినతులు స్వీకరిస్తారని చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కోసం సంబంధిత ఏఓలు, డీటీలు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు సంబంధిత రికార్డులతో రెవెన్యూ క్లినిక్‌కు హాజరుకావాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు తమ భూసంబంధిత, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ కోరారు.

Leave a Reply