పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా

పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా
- మద్యం, వ్యసనాలకు బానిసైన బి పి ఎం
- డబ్బులు జమ చేసిన తండ్రిపై చేయిచేసుకున్న బి పి ఎం
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్లకి చెందిన ద్వారకేశ్వర రెడ్డి గత కొంతకాలంగా పాటిమట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బి పి ఎం) గా పని చేస్తున్నారు. మద్యం, వ్యసనాలకు బానిసైన ద్వారకేశ్వర రెడ్డి ఇటీవల గ్రామంలోని ఆయా రైతులకి చెందిన ఖాతాల్లో పి ఎం కిసాన్, రైతు భరోసా నిధులతో పాటు, పలువురి పోస్టాఫీస్ అకౌంట్లలో రూ.2 లక్షల 30 వేలు స్వాహా చేశాడు. గ్రామానికి చెందిన బండ బిక్షం రెడ్డికి చెందిన రూ.25 వేలతో పాటు మరికొంతమంది డబ్బులు స్వాహా చేయడంతో మోతె విజయ్ రెడ్డి ఎస్ పి ఎం కి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అవివాహితుడైన బి పి ఎం ద్వారకేశ్వర రెడ్డి తండ్రి కొండల్ రెడ్డికి సమాచారం అందడంతో తన కొడుకు ఉద్యోగం పోతుందన్న బాధతో అట్టి డబ్బులను ఎస్ పి ఎం రచ్చ రమేష్ సమక్షంలో రూ.2 లక్షల 30 వేలు ఆయా ఖాతాల్లో జమ చేశారు.
ఇప్పటికే ఇలా 4,5 సార్లు ఖాతాల్లో డబ్బులు బి పి ఎం స్వాహా చేయగా తండ్రి కొండల్ రెడ్డి కట్టేవారని, తీరా తాను డబ్బులు జమ చేసినప్పటికీ తండ్రి కొండల్ రెడ్డి పై సదరు బి పి ఎం రైతులు, ఎస్ పి ఎం సమక్షంలోనే ఎందుకు డబ్బులు కట్టావు అంటూ చేయి చేసుకోవడంతో అందరు ఆవాక్కయ్యారు. రైతులు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వెళ్తుండగా బి పి ఎం తండ్రి కొండల్ రెడ్డి వారిని అడ్డుకొని కాళ్ళు పట్టుకొని కేసు పెట్టొద్దని బ్రతిమిలాడారు. ఇలా మద్యం, వ్యసనాలకు బానిసైన కుమారుడి ఉద్యోగం కాపాడుకునే ప్రయత్నం చేసిన తండ్రి పైనే సదరు బి పి ఎం చేయి చేసుకున్న సంఘటన అందరిని కలచివేసింది.
ఎస్ పి ఎం వివరణ : పాటిమట్ల బి పి ఎం ద్వారకేశ్వర రెడ్డి రైతులకు చెందిన రూ.2 లక్షల 30 వేలు వాడుకున్నది వాస్తవమేనని, అట్టి డబ్బులు తండ్రి కొండల్ రెడ్డి జమచేశారని, బి పి ఎం పై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మోత్కూర్ ఎస్ పి ఎం రచ్చ రమేష్ తెలిపారు.
