తుపాన్లకూ తలొగ్గని వరి

తుపాన్లకూ తలొగ్గని వరి
అమరావతి, ఆంధ్రప్రభ : వరి సేద్యంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తుపానులను తట్టుకునే సామర్థ్యం ఉన్న కొత్త వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ఆర్జీఎల్ 7034’ పేరుతో రూపొందించిన ఈ రకం, అధిక దిగుబడి ఇవ్వడమే కాకుండా తెగుళ్లను, ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనే లక్షణాలు కలిగి ఉంది. రాష్ట్రంలో సన్న బియ్యానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఈ రకం భవిష్యత్తులో సన్న బియ్యం కొరతను అధిగమించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
వర్సిటీ పరిశోధనా సంచాలకులు, ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గ్రహీత డాక్టర్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ వంగడాన్ని రూపొందించారు. ఎన్ఎల్‌ఆర్ 34449 రకాన్ని ‘చిట్టి ముత్యాలు’ రకంతో సంకరజాతి చేసి అభివృద్ధి చేశారు. ఈ రకం పంట కాలం సుమారు 140 రోజులు. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. ప్రస్తుతం రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న బీపీటీ 5204 రకంతో పోలిస్తే, ఇది ఎకరానికి 10-15 బస్తాలు అధికంగా దిగుబడి ఇస్తోంది. అలాగే దోమపోటు, ఎండాకు వంటి తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది వచ్చిన మొంథా తుపాను సమయంలో కూడా ఈ రకం పంట పొలాల్లో పడిపోకుండా నిలబడినట్లు పరిశీలనలో తేలింది.
గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా…
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల మోహన్‌రెడ్డి తన పొలంలో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు. తుపాను సమయంలో ఆయన పొలంలోని ఆర్జీఎల్ 7034 పంట నిలబడగా, పక్కనే ఉన్న బీపీటీ రకం పూర్తిగా నేలకొరిగిందని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 40 సన్న రకాల వరి సాగులో ఉన్నప్పటికీ, ఆర్జీఎల్ 7034 నిజంగా ‘గేమ్ చేంజర్’గా నిలుస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంలో పెట్టుబడి తక్కువగా ఉండటంతో పాటు తెగుళ్ల సమస్య కూడా తగ్గుతుంది. ఎకరానికి ఒక్క బస్తా యూరియా మాత్రమే సరిపోతుందని, పురుగుమందు కూడా ఒక్కసారి పిచికారీ చేస్తే చాలునని తెలిపారు. తుపానులు వచ్చినా పంట పడిపోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. డాక్టర్ సత్యనారాయణ అభివృద్ధి చేసిన వరి వంగడాలు ఇప్పటికే దేశంలోని 16 రాష్ట్రాల్లో సాగవుతున్నాయి.
