మహిళ ఆర్థికంగా బలపడితేనే కుటుంబం బలపడుతుంది…

మహిళ ఆర్థికంగా బలపడితేనే కుటుంబం బలపడుతుంది…

మహిళల సాధికారతకు ఆర్థిక స్వావలంబననే బలమైన పునాది.
ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుందని కుటుంబం బలపడితేనే సామాజం అభివృద్ధి చెందుతుందని ఆర్థిక స్వాతంత్య్రం మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలోని రైజ్ సెంటర్‌లో మహిళలకు సోలార్ డ్రైయింగ్ పౌడర్ ప్రాసెసింగ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మహిళా సాధికారతకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సోలార్ డ్రైయింగ్ సాంకేతికత ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు వివిధ రకాల పండ్లు, కూరగాయలను సోలార్ డ్రైయింగ్ ద్వారా నిల్వ చేసి పౌడర్ రూపంలో ప్రాసెస్ చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు.

మహిళలు ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తోందని, స్వయం సహాయక సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైజ్ సెంటర్ ద్వారా అందిస్తున్న శిక్షణలు మహిళలలో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో నిపుణులు సోలార్ డ్రైయింగ్ ప్రక్రియ, ఉత్పత్తుల తయారీ, నాణ్యత ప్రమాణాలు, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలకు వివరించారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి. నాంచారరావు, అగ్రో ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి పవన్‌కుమార్, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, రైజ్ సెంటర్ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.