టైగర్ జోన్‌లో ఏం జరిగింది..?

పరిణామాలపై రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ బృందం విచారణ

జన్నారం, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, జన్నారం అటవీ డివిజన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రధాన అటవీ శాఖ అధికారి వినయ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ డీఎఫ్‌ఓ సీహెచ్ శివయ్య నేతృత్వంలోని బృందం మంగళవారం రాత్రి జన్నారం చేరుకుంది. బుధవారం ఉదయం స్థానిక ఎఫ్‌డీఓ రామ్మోహన్‌తో కలిసి ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించింది.

ఈ సందర్భంగా ఈ నెల 2న రేంజ్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఫర్నిచర్, రికార్డుల ధ్వంసం జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. అలాగే నాయకపుగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివాసీ యువకులతో జరిగిన ఘటన, రేంజ్ కార్యాలయం ఎదుట నిర్వహించిన రాస్తారోకో, ఇసుక అక్రమ రవాణా, కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట, నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ కార్యాలయంపై జరిగిన దాడి తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ డీఎఫ్‌ఓ సీహెచ్ శివయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన అటవీ శాఖ అధికారి ఆదేశాల మేరకు టైగర్ జోన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలపై విచారణ నిర్వహిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం నివేదికను రాష్ట్ర ప్రధాన అటవీ శాఖ అధికారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర అటవీ శాఖ మంత్రిని కలిసిన ప్రతినిధుల బృందం

టైగర్ జోన్‌లో గత ఆరు నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర అటవీ శాఖ అసోసియేషన్ ప్రతినిధుల బృందం మంగళవారం రాత్రి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పీసీసీఎఫ్ వినయ్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను కలిసింది.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఘటనలను వారికి వివరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అటవీ శాఖ అసోసియేషన్ ప్రతినిధుల బృందంలోని ఒక నాయకుడు ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖలో, అధికార పార్టీ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.