నిరాశ్రయ భవనాలకు దూరంగా నిరాశ్రయులు
నిరాశ్రయ భవనాలకు దూరంగా నిరాశ్రయులు
పట్టించుకోని పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
చిట్టినగర్, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు నిరాశ్రయులైన వారికి నైట్ షెల్టర్ ద్వారా ఆశ్రయం కల్పించాలని స్పష్టంగా ఆదేశించినప్పటికీ, విజయవాడ నగరంలో అనేక మంది నిరాశ్రయులు ఫుట్‌పాత్‌లు, వంతెనల క్రింద, డివైడర్ల పక్కన, సొరంగాల్లోనే రాత్రులు గడుపుతున్న పరిస్థితి కొనసాగుతోంది.
పనుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వలస కార్మికులు రాత్రి ఉండటానికి స్థలం లేక ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరికి షెల్టర్ హోమ్‌ల గురించి తెలిసినా, స్వేచ్ఛ కారణంగా అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
విజయవాడ నగరంలో సుమారు 1200 మందికి ఆశ్రయం కల్పించే అవసరం ఉండగా, ప్రస్తుతం నాలుగు షెల్టర్ హోమ్‌లలో కలిపి సుమారు 350 మందికే మాత్రమే సదుపాయం అందుతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్‌పేటలో 100 మంది, కృష్ణలంక రాణీగారి తోటలో 50 మంది, వెహికల్ డిపో సమీపంలో 100 మంది, పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్‌లోని కొండబడి షెల్టర్‌లో 100 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు.
ఈ షెల్టర్ హోమ్‌లు కేంద్ర ప్రాయోజిత దినదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్, రాష్ట్ర మున్సిపల్ పేదరిక నిర్మూలన మిషన్ సహకారంతో నిర్వహించబడుతున్నాయి. వీటిలో మంచాలు, పరుపులు, టీవీ, టాయిలెట్ సదుపాయాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ, నెలవారీ వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పిస్తున్నప్పటికీ, కొంతమంది నిరాశ్రయులు రైల్వే స్టేషన్, బస్టాండ్, పున్నమి ఘాట్, సొరంగ ప్రాంతాల్లోనే రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. అక్కడ స్వేచ్ఛగా ఉండటం, దాతలు ఆహార పొట్లాలు అందించడం వంటి కారణాలతో షెల్టర్ హోమ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ఉన్నత న్యాయస్థానం అన్ని జిల్లాల్లో కనీసం రెండు షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేయాలని, అందులో ఒకటి మహిళల కోసం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, విజయవాడలో కూడా మరిన్ని షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
