మక్తల్‌లో వీధి కుక్కల పట్టివేత ప్రారంభం
ప్రత్యేక బృందంతో చర్యలు..
పర్యవేక్షించిన మున్సిపల్ చైర్‌పర్సన్
మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ కేంద్రంలో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమం ఎట్టకేలకు ప్రారంభమైంది. చాలాకాలంగా వీధి కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటిని తరలించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి.
గత నెల 29న ఒకేసారి పదిమందికి పైగా కుక్కల దాడికి గురికావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మున్సిపల్ పాలకవర్గం స్పందించి సూర్యాపేట నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించింది. బుధవారం ఉదయం నుంచి వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పట్టివేత కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు, పాలకవర్గ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజయ్య అందుబాటులో లేకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది.
పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో దాదాపు 200కు పైగా వీధి కుక్కలు సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంతో కుక్కల పట్టివేత చేపట్టినా, మళ్లీ వాటి సంఖ్య పెరగడంతో సమస్య తిరిగి మొదలైందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రత్యేక బృందం ప్రతిరోజూ వీధి కుక్కలను పట్టుకుని తరలిస్తోందని, పట్టణంలో సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీధి కుక్కల సమస్యను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి. ఐమరేందర్ రెడ్డి, వాకిటి హన్మంతు, నీలా గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
