కలలకు రెక్కలు తొడిగిన వేళ..

కలలకు రెక్కలు తొడిగిన వేళ..

ఆరుగురు టాపర్లకు ఆకాశయానం..
నందిగామలో ప్రతిభకు అరుదైన గౌరవం..
పేదింటి పిల్లలకు విమాన ప్రయాణం..
అవకాశం కల్పించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య..
టాప్ స్కోరర్ల జీవితాల్లో మరపురాని అనుభూతి..
విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సందేశం..

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభతో మెరిసిన బడుగు కుటుంబాల విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే కానుకగా నందిగామలో ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం నిలిచింది. నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం కల్పించారు. ఎంపికైన విద్యార్థులు తమ కృషి, పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను మరింత పెంచారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు..

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నందిగామ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచారు. వీరిలో షేక్ అర్షియా నాజ్ కంచికచర్ల మండలం మొగులూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి 589 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ప్రజాపతి పర్వీన్ నందిగామ మండలం లింగాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి 576 మార్కులు సాధించారు. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడుకు చెందిన విద్యార్థి 571 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. పల్లెపోగు వినీల చందర్లపాడు మండలం ముప్పాళ్ల గురుకుల పాఠశాల నుంచి 567 మార్కులు, నారిశెట్టి జగదీష్ ఆదిత్య చందర్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి 559 మార్కులు, ఉప్పులూరి సోనీ ప్రియా నందిగామ పరిధిలోని అనాసాగరం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి 549 మార్కులు సాధించి టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

నిరుపేద కుటుంబాల నుండి…

రోజువారీ కూలీ పనులు, చిన్న ఉపాధి పనులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తల్లిదండ్రుల పిల్లలైన వీరికి విమాన ప్రయాణం జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారింది. సాధారణంగా బస్సు, రైలు ప్రయాణాలకే పరిమితమైన ఈ విద్యార్థులు తొలిసారిగా విమానంలో ప్రయాణించడంతో వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని అన్నారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల త్యాగం ప్రధాన కారణమని పేర్కొంటూ, ఈ పిల్లలు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నందిగామలో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పెద్ద కలలు కనాలనే ధైర్యాన్ని నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

Leave a Reply