నాగుపాము కాటుతో మహిళ మృతి
పరకాల (ఆంధ్రప్రభ): హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని న్యూ మున్సిపాలిటీ పరిధి బుడిగజంగాల కాలనీలో నాగుపాము కాటుకు మహిళ మృతి చెందడంతో విషాదం నెలకొంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం కాలనీకి చెందిన పస్తం వసంత (44) గ్రామాల్లో స్టీల్ సామాన్లు విక్రయిస్తూ జీవనం సాగించేది. సోమవారం వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చి నిద్రిస్తుండగా రోడ్డు పక్కన ఉన్న చెట్ల నుంచి ఇంట్లోకి దూరిన నాగుపాము ఆమెను రెండుసార్లు కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.
మృతురాలికి భర్త వెంకటస్వామితో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ న్యూ మున్సిపాలిటీ సమీపంలోని రోడ్డు పక్కన చెత్తాచెదారం, నిరుపయోగమైన చెట్లు పేరుకుపోవడంతో విషసర్పాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. వాటిని తొలగించాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు.
