Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై ఆషాడ వైభవం…
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి
21వ రోజు 39 సారె బృందాలతో 16,921 మంది భక్తుల రాక
నాయి బ్రాహ్మణ వర్కర్స్ యూనియన్ నుంచి ఆషాఢ సారె..
రూ.3.88 లక్షల బంగారు హారం విరాళం
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి వి.అనిత
Indrakeeladri |(ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాస సారె మహోత్సవాలు రోజురోజుకూ వైభవోపేతంగా సాగుతున్నాయి. అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. ఉత్సవాల 21వ రోజైన మంగళవారం 39 సారె బృందాలు అమ్మవారికి సారె సమర్పించగా, ఆయా బృందాలకు చెందిన 16,921 మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం, ప్రసాదాల పంపిణీ, సారె బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.

ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ సారె బృందాలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తి పారవశ్యంతో కళకళలాడింది.
కేశఖండనశాల నాయి బ్రాహ్మణుల సారె…
ఆలయ కేశఖండనశాల నాయి బ్రాహ్మణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్ర ఆషాఢ సారె సమర్పించారు. ఈఓ వి.కె. సీనా నాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ఆలయాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, ఏ.జీ.ఎల్. నారాయణ, ఆర్.వి. రమణ, జి. హరికిరణ్, ఎ. పూర్ణ కనకారావు, పి. సంతోష్, ఎ. రాంబాబు, ఆర్. రమణ, జి. సంతోష్, కె. కిషోర్, కె. సిద్ధయ్య, వై. సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి బంగారు కానుకలు…
కర్నూలు జిల్లా రామచంద్రారెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్వరరావు,రాజేశ్వరి దంపతులు శ్రీ కనకదుర్గమ్మవారికి రూ.3.88 లక్షల విలువైన బంగారు హారాన్ని భక్తిశ్రద్ధలతో విరాళంగా సమర్పించారు. ప్రధానాలయ సూపరింటెండెంట్ డి.వి.వి. సత్యనారాయణ సమక్షంలో బంగారు హారాన్ని దేవస్థాన అధికారులకు అందజేయగా, దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి వేదపండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ఎస్. సరిత, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకరబాబు కలిసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, ప్రసాదాల పంపిణీ, భద్రత, తాగునీరు, క్యూలైన్ నిర్వహణ తదితర ఏర్పాట్లను దేవస్థాన యంత్రాంగం సమర్థంగా నిర్వహిస్తోంది.
