ఆర్ఆర్ పేట బాధితుల పేరుతో రాజకీయం సిగ్గుచేటు

రెండుసార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా వాళ్లకు చేసిందేముంది
ఎమ్మెల్యే సుజనా చౌదరి,ఎంపీ చిన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు
బాధితుల చట్టబద్ధమైన,శాశ్వత పరిష్కారం కోసం ఎంపీ కృషి
కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీనివాసరావు

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ రాజరాజేశ్వరి పేటలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న కుటుంబాల సమస్యను అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెల్లంపల్లి బాధితుల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. పేదల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు.

2021లో అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాజరాజేశ్వరి పేటకు వచ్చి అక్కడి ప్రజలకు పట్టాలు ఇస్తామని,న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఒక కాగితం ఇచ్చి ఓట్లు వేయించుకుని, అనంతరం ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆ హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి ఆ సమయంలో బాధితులకు శాశ్వత పరిష్కారం చూపకుండా ఇప్పుడు వారి కన్నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకుని, తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయానో ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల హామీలను నిలబెట్టుకునే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సంబంధిత రైల్వే అధికారులతో నేరుగా మాట్లాడి, ప్రస్తుతం అక్కడ కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా, ఇప్పటికే నివసిస్తున్న కుటుంబాలను తొందరపడి ఖాళీ చేయించకుండా చూడాలని అధికారులను కోరారని తెలిపారు.అలాగే బాధితుల సమస్యకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం, రైల్వే అధికారులతో సమన్వయం చేసి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ప్రజలకు నిజమైన సహాయం చేయకుండా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ప్రజల సమస్యలపై చౌకబారు రాజకీయాలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వెల్లంపల్లి శ్రీనివాస్‌కు హితవు పలికారు.