ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలి..

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలి..

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
పారదర్శక కొనుగోళ్లు పై దృష్టి సారించాలి..
గన్నీ బ్యాగులు, లారీలు, గోదాములపై ప్రత్యేక దృష్టి…
నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు..
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ధాన్యం సేకరణ పై అధికారులతో సమీక్ష

తిరువూరు, ఆంధ్రప్రభ : రైతులందరూ ఆరుగాలం కష్టపడి దాన్యం పండిస్తున్న ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ధాన్యం సేకరణ వ్యవస్థపై శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయంలో గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. నాలుగు మండలాల వ్యవసాయ అధికారులతో క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు ఉన్నాయా, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేస్తున్నారా అనే అంశాలపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆరా తీశారు. గోదాముల సామర్థ్యం, నిల్వ సౌకర్యాలు సరిపోతున్నాయా అనే దానిపై సమీక్ష నిర్వహించారు. లారీలు సమయానికి అందుబాటులో లేక రైతులు పడుతున్న ఇబ్బందులు, గన్నీ బ్యాగుల కొరత, రవాణా వ్యవస్థలో లోపాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించేలా చూడాలని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచి ఉండే సమయం తగ్గించడంపై దృష్టి పెట్టాలని, తాగునీరు, షెడ్లు, తాత్కాలిక వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులకు సమయానుకూల సమాచారం అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యలను అత్యవసరంగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి మండలంలో పరిస్థితులను రోజువారీగా మానిటరింగ్ చేయాలని ఆదేశిస్తూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో పనులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.