రంగారెడ్డి కలెక్టరేట్‌లో విషాదం.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య
రంగారెడ్డి కలెక్టరేట్‌లో విషాదం.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య
పై అధికారి మానసిక వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు
ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పై అధికారి నుంచి ఎదురైన మానసిక వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఆదిభట్ల పోలీసుల వివరాల ప్రకారం.. తుర్కయాంజల్ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన శ్రీధర్ బాబు (39) రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గిరిజన సంక్షేమ శాఖలో అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ నెల 2వ తేదీ ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
గత కొంతకాలంగా కార్యాలయంలోని ఓ పై అధికారి నుంచి తీవ్ర మానసిక వేధింపులకు గురవుతున్నట్లు శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులు, సహోద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపారు.
వేధింపులకు పాల్పడిన అధికారి ఎవరనే అంశంతో పాటు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
