Seaweed Farming | ఆర్కే బీచ్ సమీపంలో తొలి దిగుబడి

Seaweed Farming | ఆర్కే బీచ్ సమీపంలో తొలి దిగుబడి

Seaweed Farming | మత్స్యకార కుటుంబాలకు ఆదాయ మార్గంగా నాచు సాగు
వేట నిషేధ కాలానికి ప్రత్యామ్నాయ ఉపాధి
సబ్సిడీపై నాచు విత్తనాలు, ప్రత్యేక శిక్షణ
45 రోజుల్లో పంట.. అదనపు ఆదాయానికి అవకాశం
ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మత్స్యశాఖ సహకారం
ఆహారం, ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లో సముద్రపు నాచు వినియోగం

Seaweed Farming | విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖ ఉమ్మడి జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు నాచు సాగు వరంగా మారింది. ఇక చేపల వేట నిలిచినా ఆదాయానికి కొదవ ఉండదు. మత్స్యకారుల జీవితాలను ప్రభావితం చేస్తున్న రెండు నెలల వేట నిషేధ కాలానికి చెక్ పడింది. ప్రభుత్వ నిర్ణయంతో తీర ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలకు ఆదాయ మార్గం సుగమమైంది.

సముద్రంలో నాచు పెంపకంపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. అనకాపల్లి జిల్లాలోని తీర గ్రామాల్లో మత్స్యకారులకు నాచు పెంపకంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సబ్సిడీపై కిలో నాచు విత్తనాన్ని కేవలం రూ.25కే అందిస్తోంది. మార్కెట్‌లో కిలో నాచు ధర రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. ఆసక్తి ఉన్నవారికి సమాచారంతో పాటు విత్తనాన్ని కూడా అందిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయంగా నాచు సాగు..

మత్స్యకారులు సముద్రంలో వేట ఒక్కటే కాకుండా ప్రత్యామ్నాయంగా నాచు సాగు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా మేము తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు నాచు పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పురుషులకు 40 శాతం, మహిళలకు 60 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నాం. అలాగే ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సహకారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

– శ్రీనివాసులు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు

పంట సమయం 45 రోజులు..

సముద్రంలో అలలు లేని ప్రాంతంలో బెడ్లు ఏర్పాటు చేసుకుని నాచు సాగు చేయాల్సి ఉంటుంది. నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉన్న ప్రాంతాలు నాచు పెంపకానికి అనుకూలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒక విడత నాచు పంట రావడానికి 45 రోజుల సమయం పడుతుందని, నిత్యం నాచు సాగు చేస్తే అదనపు ఆదాయం లభిస్తుందని అంటున్నారు.

సముద్ర జలాల్లో తాడులు, తేలియాడే పరికరాల సహాయంతో నాచు పెంచే విధానాన్ని అధికారులు నేర్పిస్తున్నారు. మహిళలు, యువకులు సైతం ఈ పనిలో భాగస్వాములవుతున్నారు. ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సహకారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కిలో రూ.21 వేలు..

ఆర్కే బీచ్, తెన్నేటి పార్కు, లారీపేట, సాగర్‌నగర్, తిమ్మాపురం, రుషికొండ తదితర ప్రాంతాల్లో సముద్రం ద్వారా లభించే సముద్రపు నాచు సీ వీడ్ పోషకాల నిధి. వీటి పెంపకంపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోనూ క్షేత్రస్థాయిలో దీని ఉత్పత్తి, ప్రయోగాలు చేపడుతున్నారు.

విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ తీరం సమీపంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సముద్రపు నాచు సాగులో తొలి దిగుబడి వచ్చింది. తమిళనాడు నుంచి విత్తనాలు తీసుకొచ్చి మొత్తం 50 యూనిట్ల ద్వారా థాన్ ఫౌండేషన్ మహిళల పర్యవేక్షణలో నాచు పెంపకం చేపట్టారు.

ఉపాధికి లోటు లేదు..

“నాచు పెంపకంలో వారం క్రితం మా ఊరిలో ట్రైనింగ్ ఇచ్చారు. పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 40 మందికి శిక్షణ ఇచ్చారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనిలా ఉంది. ప్రభుత్వం సహకరించి మాకు ఉచితంగా పనిముట్లను పంపిణీ చేస్తే, నాచు సాగు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.”

– దుర్గారావు, మత్స్యకారుడు

తొలి విడతగా రెండు టన్నుల దిగుబడి వచ్చిందని మత్స్యశాఖ జేడీ తెలిపారు. నాచు ధర కిలో రూ.21 వేల వరకు ఉందని, అయితే విశాఖలో పండించిన నాచుకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని మత్స్యశాఖ జేడీ పి. లక్ష్మణరావు తెలిపారు. సముద్రపు నాచును ఆహారం, ఔషధాలు సహా సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు.