గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

క్యాతన్‌పల్లి, (ఆంధ్రప్రభ): రామగుండం సీపీ, డీసీపీల ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పరిధిలో పోలీసులు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలో గంజాయి సేవించేవారు, విక్రయించేవారిపై వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా అనుమానితుల ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఈ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయిని ఎక్కడైనా దాచి ఉంచినట్లయితే సులభంగా గుర్తించవచ్చని పట్టణ ఎస్.ఐ శ్రీధర్ తెలిపారు.

రామకృష్ణాపూర్ పరిధిలో ఎవరికైనా గంజాయి సేవించే అలవాటు ఉన్నా లేదా విక్రయించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నా వెంటనే వాటిని మానుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఈగల్’ (EAGLE) అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఈ బృందం నిరంతరం నిఘా ఉంచుతూ గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తోందని ఎస్.ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు జంగు, వెంకటేశ్వర్లు, నార్కోటిక్ విభాగం సిబ్బంది మరియు పోలీసులు పాల్గొన్నారు.