Qualifier 2 | ముంబై vs పంజాబ్ మధ్య కీలక సమరం…
- టాస్ గెలిచిన పంజాబ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఆఖరి దశలోకి ప్రవేశించింది. తుది పోరును అందించనున్న కీలకమైన మ్యాచ్ క్వాలిఫయర్ 2 కి రంగం సిద్ధమైంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ విజేత ఫైనల్‌కు చేరుకొని, ఆర్సీబీతో ఫైనల్లో తలపడనున్నారు.
కాగా, నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్ చేపట్టనుంది.
ముంబై ఇండియన్స్ : జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాజ్ అంగద్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వైషాక్ విజయ్‌కుమార్, కైల్ జామీసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
ముంబై ఇండియన్స్ – అనుభవజ్ఞుల బలంతో ముందుకు
ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ గెలిచిన చరిత్రను కలిగిన జట్టు. ఈ సీజన్‌లో ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 20 పరుగుల విజయంతో మంచి ఫార్మ్‌లో ఉన్నారు . జస్ప్రిత్ బుమ్రా డెత్ ఓవర్లలో కీలక పాత్ర పోషించనున్నారు, అలాగే సూర్యకుమార్ యాదవ్ మధ్య ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించి జట్టుకు బలాన్ని అందిస్తున్నారు .
చరిత్ర సృష్టించే లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ !
పంజాబ్ కింగ్స్ గతంలో ఐపీఎల్ ఫైనల్‌కు కేవలం ఒకసారి మాత్రమే చేరారు. ఈ సీజన్‌లో లీగ్ దశలో ముంబైపై విజయం సాధించిన పంజాబ్, నరేంద్ర మోదీ స్టేడియంలో 66.6% విజయ శాతంతో మంచి రికార్డు కలిగి ఉన్నారు . కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ఫైనల్‌కు చేరేందుకు ప్రయత్నిస్తోంది.
హెడ్-టు-హెడ్
మొత్తం 33 మ్యాచ్‌లలో ముంబై 17 విజయాలు, పంజాబ్ 16 విజయాలతో సమానంగా పోటీ చేస్తున్నారు. ఈ సీజన్‌లో లీగ్ దశలో పంజాబ్ ముంబైపై విజయం సాధించింది .
