H1B Visa 2026 | తెలుగు రాష్ట్రాల టెక్కీలకు కొత్త సవాళ్లు

H1B Visa 2026 | తెలుగు రాష్ట్రాల టెక్కీలకు కొత్త సవాళ్లు
H1B Visa 2026 | అమెరికా కఠిన నిబంధనలతో తగ్గిన హెచ్-1బీ దరఖాస్తులు
భారతీయ ఐటీ నిపుణులపై భారీ ప్రభావం
అధిక నైపుణ్యం ఉన్న వారికే పెరుగుతున్న ప్రాధాన్యం
AI, సైబర్ సెక్యూరిటీ రంగాల్లోనే భవిష్యత్ అవకాశాలు
H1B Visa 2026 | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో హెచ్-1బీ వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయాయి. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 38.5 శాతం పడిపోయినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది.
ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు ఆందోళన పడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాలకు మొత్తం 3,43,981 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 2,11,600కు పడిపోయింది. అంటే దాదాపు 1.32 లక్షల నమోదులు తగ్గిపోయాయి.
అమెరికా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడం, తక్కువ వేతనాలతో పెద్దఎత్తున దరఖాస్తులు చేసే వారిపై ఆంక్షలు విధించడం దరఖాస్తులు తగ్గడానికి ప్రధాన కారణమని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వ అధికారుల కథనం ప్రకారం, అధిక నైపుణ్యం ఉన్న వారికి, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన దరఖాస్తుదారులకు హెచ్-1బీ వీసా మంజూరీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు.
వీసాలకు ఎంపికైన అభ్యర్థుల్లో దాదాపు 71.5 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ లేదా ఆపై స్థాయి డిగ్రీలు పూర్తి చేసిన వారేనని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. గత ఏడాది ఈ శాతం 57 మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇక తక్కువ వేతన శ్రేణిలో ఉన్న దరఖాస్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు అమెరికా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వీసా కోసం ఎంపికైన వారిలో కేవలం 17.7 శాతం మాత్రమే కనిష్ఠ వేతన విభాగానికి చెందిన వారని చెబుతోంది.
తక్కువ వేతనాలతో భారీ స్థాయిలో దరఖాస్తులు చేసి వ్యవస్థను దుర్వినియోగం చేసే రోజులు ముగిశాయని యూఎస్సీఐఎస్ పేర్కొంది. హెచ్-1బీ వీసాల మంజూరు వ్యవస్థను నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఉపయోగిస్తున్నామని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన “అమెరికా ఫస్ట్” విధాన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ రంగంలోని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా ఉద్యోగాలను రక్షించడం, స్థానిక కార్మికులకు అవకాశాలు పెంచడం లక్ష్యంగా హెచ్-1బీ విధానాల్లో మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ క్రికొరియన్ హెచ్-1బీ వీసాల మంజూరుపై మరింత ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హెచ్-1బీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని, అలాగే విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఓపీటీ విధానాన్ని నిలిపివేయాలని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
హెచ్-1బీ దరఖాస్తుల్లో సుమారు 71 శాతం భారతీయులవేనని యూఎస్సీఐఎస్ గణాంకాలు చెబుతున్నాయి. వీసాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. భారతీయులు ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్యరంగం, పరిశోధన రంగాల్లో అధికంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, బెంగళూరు, చెన్నై, పుణే వంటి ఐటీ కేంద్రాల నుంచి వేలాది మంది ఏడాది అమెరికాకు వెళ్తుంటారు. ఇప్పుడు నమోదులు తగ్గిపోవడంతో కొత్త ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు టెక్కీలపై ప్రభావం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు హెచ్-1బీ వీసాలపై భారీగా ఆధారపడుతున్నారు. అమెరికాలో ఉద్యోగాల కోసం కోచింగ్, కన్సల్టెన్సీల ద్వారా దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. అయితే కొత్త నిబంధనల కారణంగా ఇకపై కేవలం డిగ్రీ సరిపోదని, అధిక నైపుణ్యం, ఉన్నత వేతనం, అమెరికా విద్యార్హతలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కనుందని స్పష్టమవుతోంది.
దీంతో అమెరికాలో ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
