Intellectuals | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి
Intellectuals | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి
చిరంజీవులు..
Intellectuals | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (బీసీఐ) వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీసీఐ విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా “హిస్సా–ఇజ్జత్–హుకూమత్” నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన చిరంజీవులు, బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజకీయ సాధికారతను పొందాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమూ తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోలేదని వ్యాఖ్యానించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ విజయ్‌బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్‌గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, ఎర్రమాడ వెంకన్న, లింగేష్ యాదవ్‌లను నియమించారు. అలాగే ప్రొఫెసర్ బెనర్జీకి రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ విజయ్‌బాబుకు పొలిటికల్ అడ్వైజర్‌గా నియామక పత్రాలు అందజేశారు.
సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
